Tuesday, 20 April 2010

ప్రార్ధన

పసిపాపల చిరునవ్వులకు సంతసించు
నా మనసును మొద్దుబారనీయకు,
చిరుజల్లుకు హరివిల్లుకు ఉప్పొంగే
నా గుండెలోని ఆనందం ఆవిరవనీయకు,
సాటి మనిషివేదనకు చెమర్చు
నా కంటితడిని ఆరిపోనీయకు,
స్వామీ నా ప్రార్ధన మన్నించి
నాలోని మనిషిని మరణించనీయకు.

Sunday, 7 March 2010

ఓ మహిళా నీకు వందనం!

తల్లివై మాకు జీవితాన్నిచ్చి ,
చెల్లివై మాకు ప్రేమను పంచి ,
నేస్తమై మాకు దారిని చూపి ,
భార్యవై మాకు వెలుగును పంచే ,

ఓ మహిళా నీకు వందనం !

Friday, 5 March 2010

అమృత వర్షం

నులివెచ్చని సాయం సమయం లో
సంధ్య రాగం నీ తలపు,
నీకై వేచే నా మదిలో,
అమృత వర్షం నీ వలపు.

Thursday, 21 January 2010

ఆశావాది

తెలతెలవారున తూరుపులో,
అరుణోదయాలు నాకోసం!
మబ్బులు వీడిన ఆకాశంలో,
వెన్నెల వెలుగులు నాకోసం!
వసంతమాసపు విరితోటల్లో,
కోకిల పాటలు నాకోసం!
'ఏరా,మామా'అను పిలుపుల్లో
స్నేహసుగంధం నాకోసం!

Monday, 16 February 2009

జీవితం

జీవితమంటే ఆరాటం,
ఆశ నిరాశల పోరాటం!

Thursday, 4 December 2008

చెలీ

అందమైన నా చెలీ
చక్కనైన జాబిలీ
నా హృదయం లోగిలి
నీకై తెరిచిన వాకిలి!

-శీతాకాలం, 2004.

Tuesday, 14 October 2008

తోడు

క్షణమంటే బహుకాలం
అడుగంటే కడుదూరం
నీ తోడు లేకుంటే!

Friday, 10 October 2008

నిరీక్షణ

వేసవి తాపమార్పు తొలి స్వాతి చినుకుకై,
నన్ను సేద తీర్చు నీ తేనె పలుకుకై,
నిరీక్షణ!

Wednesday, 24 September 2008

నా తొలి హైకూ

ఆరుబయట హొరెత్తిస్తూ,
నా మదిలో అల్లరి చేస్తూ,
నీ తలపుల వాన!

Saturday, 30 August 2008

నేను

నిరాశామయ శిశిరాన వసంతాభిలాషిని
మృగతృష్ణాసమూహాన జలధారాన్వేషిని

ఉగ్రతాండవమ్ముసేయు శివుని కాలి అందియని
శాంతిగీతమాలపించు రుద్రవీణ తంత్రిని

అజ్ఞానాంధకారాన అరుణోదయ కాంక్షిని
అసత్యమను అరణ్యమున ఒక సత్యాన్వేషిని!

Friday, 30 May 2008

స్నేహం

అమ్మ ప్రేమ ఆప్యాయత,నాన్న మనను ఆత్మీయత,
కలిపి నాకు అందించి,నా చింతలు గమనించి,

నేస్తమై దోస్తువై ఆ దేవుని దీవెనవైన నీతో

కలసి నడిచిన దారులు, కలహించిన తీరులు
పంచుకున్న ఙ్ఞాపకాలు, చెరిగిపోని గురుతులు

మరువలేను,మరచిపోను ఈ జన్మకు మిత్రమా!

అంకితం:ఆదిపూడి హనుమ కళ్యాణ రాజు కి

Thursday, 29 May 2008

విప్లవం

కాదు కాదని, రాదు రాదని గేలి చెసే మిత్రమా
కలలు చెరిపీ కళ్ళు తెరిచే కష్టముల కన్నీళ్లు తుడిచే
నవ వసంతం విరియు వేళ ఇదిగొ వచ్చెను చూడుమా

--రెండు వసంతాల క్రితం త్రినాధ్ కి ఆశువుగా వ్యక్తం చెసిన నా ఆవేశం :)

Wednesday, 14 May 2008

వాన

తొలకరి జల్లుల వాన
కురిసెను నా మది లోన
తుంటరి చూపుల జాణ
మీటెను నా హృది వీణ

Tuesday, 22 April 2008

నామకరణం

మహాజనులారా,

అంతర్జాలంలో తెలుగు వారు రాస్తున్న బ్లాగులను చూసి, ఇన్నాళ్ళూ ఆంగ్లమున బ్లాగుతున్న నేను అచ్చ తెనుగులో కూడా బాగా-లాగు(బ్లాగు)దామని చేస్తున్న చిన్న యత్నమే ఈ క్రొత్త సాలెగూడు -పుట (వెబ్-పేజి). దీనికి నామకరణ మహోత్సవం చెద్దామని పేర్లు వెతుకుతుండగా నాకు బాగ నచ్చిన పాత పాట -'శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్' లొని "నా పేరు బికారి నా దారి ఎడారి" గుర్తుకువచ్చింది.

ఆందులోని మొదటి చరణంలో "తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను, పాట నాకు సైదోడు పక్షి నాకు తొడు, విసుగు రాదు ఖుషీ పోదు వేసట లెనే లేదు,అసలు నా మరో పేరు ఆనంద విహారి" అంటాడు కవి.

ఐతే ఆ పాటకీ ఈ పేరుకీ సంబంధం ఏంటా అనుకుంటున్నారా? మనం ప్రతి చిన్న పనికీ ఎన్నొ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఏ చదువు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, ఏ కోర్సు చెస్తే అమెరికా వెళ్ళొచ్చు మొదలుకొని ఏ సినిమా ఏ హాల్లో చూస్తే బాగుంటుంది, ఏ కూరలు ఏ రొజు వండుకొవాలి వరకూ ఎన్నో లెక్కలు , జాగ్రత్తలు.

అలాంటిది ఏ ఆధారం లేకుండా తన జీవితాన్ని వెతుక్కుంటూ ప్రకృతినీ ప్రపంచాన్నీ నమ్ముకొని బయలుదేరిన ఆ కధానాయకుడు అంటే నాకెందుకో చాలా అభిమానం. తను విధినే నమ్ముకున్నాడో లేక తన అసమాన ధైర్యాన్నే నమ్ముకున్నాడో నాకు తెలీదుగానీ అతని తెగువకి మాత్రం ముచ్చట వేస్తుంది.ఏమో, నేను చేయలేని పనిని తాను చేసి చూపించినందుకేమో,ఈ ఇష్టం.అందుకే ఆ పాటలోని మాట- అసలు నా మరో పేరు "ఆనంద విహారి"